2027 గోదావరి పుష్కరాలు చరిత్రలో నిలిచిపోవాలి: చంద్రబాబు

  • 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
  • పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి
  • ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు అఖండ గోదావరి కారిడార్ అభివృద్ధికి సూచన
  • ఆరు జిల్లాల్లో 525 ఘాట్లు, 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
  • జూన్ 24 కల్లా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మంత్రుల కమిటీ, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని, ఇది యాత్రికులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు ఉన్న ప్రాంతాన్ని 'అఖండ గోదావరి కారిడార్'గా అభివృద్ధి చేయాలని సూచించారు. పుష్కరాల కోసం అభివృద్ధి చేసే అన్ని మౌలిక సదుపాయాలు గోదావరి బేసిన్ ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా మారాలని ఆకాంక్షించారు. ఈ పుష్కరాలతో రాజమహేంద్రవరం ఒక ప్రధాన మహానగరంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మొత్తం 525 ఘాట్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పుష్కరాలకు దాదాపు 9.95 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. యాత్రికుల సౌకర్యార్థం రహదారి, రైల్వే ట్రాఫిక్ నిర్వహణపై దృష్టి పెట్టాలని, పుష్కర ఘాట్లకు క్రమపద్ధతిలో నంబర్లు కేటాయించాలని ఆదేశించారు.

ప్రత్యేక రైళ్లు, కేంద్రం నుంచి ఆర్థిక సహాయం కోరుతూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాయాలని అధికారులకు సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన క్షేత్రస్థాయి పర్యటన సిఫార్సులను కూడా ప్రణాళికలో చేర్చాలని తెలిపారు. జూన్ 24 నాటికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని, ఆ తర్వాత పుష్కరాలకు అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.



Chandrababu
Godavari Pushkaralu 2027
TDP
Andhra Pradesh

More Telugu News